జనార్దనాష్టకము

వికీసోర్స్ నుండి

సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా
చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా
మురువు జూపుచు వచ్చినావో మోహనాకృతి మీరగా
గరుడవాహన దనుజమర్దన కందుకూరి జనార్దనా – 1

ఆన బెట్టిన రాకపోతివి అప్పుడే అటు మొన్నను
పూని బిలువగ వినకపోతివి పొద్దు మాపై మొన్నను
నేను జూడగ గడిచిపోతివి నీటు చేసుక నిన్నను
కాని లేరా దనుజమర్దన కందుకూరి జనార్దనా – 2

బిత్తరంబుగ మొలక కెంపులు పెదవి నెవ్వతె నుంచెరా
గుత్తమైన మిటారి గుబ్బల గుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల దనుజమర్దన కందుకూరి జనార్దనా – 3

నిన్న రాతిరి చవికలోపల నీవు చెలి కూడుంటిరా
ఉన్న మార్గము లన్నియును నేనొకతె చేతను వింటిరా
విన్న మాత్రము గాదురా నిను వీధిలో గనుగొంటిరా
కన్నులారా దనుజమర్దన కందుకూరి జనార్దనా – 4

చెల్లెబో పసుపంటినది నీ జిలుగు దుప్పటి విప్పరా
ముల్లు మోపగ సందు లేదుర మోవికెంపులు గప్పరా
తెల్లవారినదాక యెక్కడ తిరుగులాడితి చెప్పరా
కల్లలాడక దనుజమర్దన కందుకూరి జనార్దనా – 5

దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పు బాసలు సేయకు
మబ్బు దేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకు
ఉబ్బు చేసుక తత్తరంబున నొడలిపై చెయి వేయకు
గబ్బితనమున దనుజమర్దన కందుకూరి జనార్దనా – 6

అండబాయక కూడియుంటిమి ఆయెబోయెను నాటికి
ఖండి మండిపడంగ నేటికి కదలు మెప్పటి చోటికి
ఉండరా నీ మాటలకు నే నోర్వజాలను మాటికి
గండి దొంగవు దనుజమర్దన కందుకూరి జనార్దనా – 7

కొదవలన్నియు దీర్చుకొంటివి నా గుణము లెరిగీ శయ్యను
అద నెరింగీ యేలితివి విరవాది పూవుల శయ్యను
మదనకేళికి నీవె జాణవు మారు నేమిటి చెయ్యను
కదియ రారా దనుజమర్దన కందుకూరి జనార్దనా – 8

అలుకలన్నియు దీరగా నా అండ కెప్పుడు వస్తివి
పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి
వలచి వలపించియును గూరిమి వదల కెప్పుడు మెస్తివి
కలసి వేడుక దనుజమర్దన కందుకూరి జనార్దనా – 9

జంట నేత్రము లంటి చూచితె జాజిపూవులు పూసెరా
మింటి త్రోవను జూచుచుండగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో నొక పండువెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా దనుజమర్దన కందుకూరి జనార్దనా – 10