ఆంధ్ర రచయితలు/జనమంచి వేంకటరామయ్య

వికీసోర్స్ నుండి

జనమంచి వేంకటరామయ్య

1872 - 1933

కాశ్యపసగోత్రులు. తండ్రి: బ్రహ్మావధాని. తల్లి: మహాలక్ష్మి. నివాసము రాజమహేంద్రవరము. జననము 1872 సం. నిర్యాణము 1933 సం. కృతులు: 1. నవకుసుమాంజలి (ఖండకావ్య సంపుటము) 2. మాలతీ మాధవము 3. విద్ధసాలభంజిక (అనువాదములు) 4. సుప్రభాతము (ఖండకావ్యము) 5. మేఘదూత. 6. ఉత్తరరామ చరితము. ఇత్యాదులు.

కత్తికోతలేదు గాజుగొట్టము లేదు

మాతనెత్రు శోధసేత లేదు

ఒనరుప్రేమ బ్రకృతి యొడిజేరి చనుగ్రోలి

మేనుమఱచి నిదురెకాని కవికి.

ప్రకృతి తనుబట్టి బాధించువారి కేదొ

కడుపునకు బెట్టి కన్నీళ్లుదుడుచు గాని

దాచిపెట్టును దనపెన్నిధాన మింక

యోగమహితుడు గవివరేణ్యునకు గాను.

సుకృతిగాడె సుకవి ప్రకృతితో నేకాంత

గోష్ఠినుండు గాన కోనలందు

దవసివోలె నెపుడు తత్త్వంబె చింతించు

మధురరసము గ్రోలు మధుపమట్లు.

తత్త్వవేత్తకు నేది సత్యముగ దోచు

నదియె సౌందర్యరూపమై యమరు గవికి

జండమార్తాండ తేజ:ప్రసారమె గద

నిండుచుందురు పండువెన్నెలగ మాఱు. శ్రీ జనమంచి వేంకట రామయ్యగారి సర్వ కవితాహృదయము పలు పద్యములలో సురక్షితమై యున్నది. ప్రకృతితత్త్వములో నభిన్నుడైన యీ కవివరుని గుండెలో నమృతభాండముండె ననుటకు నిదర్శనము వీరి "నవకుసుమాంజలి." ఈ కూర్పు 23 ఖండ కావ్యముల సంపుటము. ఇందలి ప్రతిపద్యము రసోత్తరము. పాలమీగడవలె చక్కని చిక్కని కమ్మని కవిత వేంకటరామయ్యగారి చేతిలోనున్నది. ఆయన యక్షరాక్షరము తూచితూచి వేయును. చ్యుత సంస్కారములు చేరనీయక, హాయిగలిగించు శయ్యలో వీరు మంచినేరుపు చేకూర్చుకొనిరి. వడ్డాది సుబ్బారాయడుగారివలె వీరుకూడ బద్యము మలచి మలచి మెఱుగు పెట్టి మఱి వెలువరింతురు. భావములలో బ్రాతక్రొత్తల సొగసుకలయిక వారి కవితకొకయందము. పద్యము నెత్తుకొనుటలోను, దింపుటలోను, ప్రస్తరించుటలోను వీరొక నూతనత్వమును సహజముగా బ్రకటించిరి. ఆంగ్ల భాషా ప్రవేశము వీరి భావనాపథమున కొక నవవికాసము కలిగించినదని చెప్పుచుందురు. జీవితము ఛాందసప్రవృత్తిలో నడపించినను, భావములు జాతీయమార్గమున మెఱుగులు దేఱినవి. "అమృతభాండ"మను ఖండకావ్యము వేంకటరామయ్యగారి జాతీయ దృక్పథమునకు బతాక. ఈ కావ్యహృదయము కవియే యిటులు ప్రకటించెను. "హైందవ స్వరాజ్యసమితి వారి రాయబారమే యిందలి ప్రకృతవిషయము. ఈ ప్రకృతము, అప్రకృతమైన గరుడయాత్రాకథలో గొన్నిపట్ల స్ఫుటముగాను, గొన్నిపట్ల సూచనగాను వర్ణింపబడినది. ప్రకృతాప్రకృతముల నొండొంటితో సందర్భింపజేసి కావ్యమును కడవఱకును నేకార్థసమవేతముగా నిర్వహించుటకై రెంటియందును గొన్ని యావశ్యకములైన మార్పులుచేయబడెను. కావ్యాదిని ప్రతిజ్ఞాతమైన దాస్యనివృత్తికి, కావ్యాంతమందు సిద్ధ్యసిద్ధి రూపముగా జెప్పబడుటచే, పురాణకదకును బ్రస్తుతకథకును ఫలసమన్వయము కుదుర్పబడెను. ఇది యెట్లంటేని, "వినతసమ్మోదముద్రితాస్య, యగుచు వడ్డించెనమృతంబు" అని చెప్పబడుటచే దేశమున సంస్కరణముల తాత్కా కాంగీకారము, గరుడుని బంధవిముక్తిచే లోకమాన్యుని తదనంతర నిర్యాణమును, కాద్రవేయుల యాశాభంగముచే బ్రజల కిప్పటి ద్వంద్వపరిపాలనము వలని యల్పప్రయోజకత్వమును సూచితములు"

కవికి లోకజ్ఞత యుండవలసిన ముఖ్యలక్షణము. రాజకీయముగా దటస్థించు సంస్కృతి నెప్పటికప్పుడు గుర్తించుకొనుచుండెడి వేంకటరామయ్యగారి కడుపులోని "అమృతభాండము" కలమునుండి వెలి కుబుకుటలో నాశ్చర్యమేమి ? 'నాదారితోడు' అను కావ్యములో నంటరానివారిపై వీరు వెలిబుచ్చిన యనుకంపాభావము మఱచిపోరానిది.

క. వెలివాడ బుట్టినంతనె

వెలిబెట్టునె యీశు డతనిప్రేమకు బాత్రం

బులుగాని జంతు లిలలో

పల గలవే ? గాలిలేని బ్రదుకుంగలదే ?

క. ఒక యీశ్వరుకృప నందఱ

మొకయోడనెయెక్కి దాటి యొక నంద్రమునే

యొకతీరమె చేరగవలె

నిక నీసంశయములేల యిచ్చట మనకున్ ?

గీ. శాన సందేహపడక యోదోనెవాడ!

యెక్కని మ్మీమె నాతోడ నెక్కనిమ్ము

ఎక్కనిచ్చిన నీకేమి యెగ్గులేదు

తఱచిచూచిన నాకేమి తగ్గులేదు.

గీ. ధర్మజునిపోల్కి నేగాను ధార్మికుడను

అంటరానిదిగా దింతి యతని వేపి యట్టు ; లటులయ్యు మే మెక్కి నట్టిదోనె

వారలెక్కిన తొలిమెట్టె స్వర్గమునకు.

వివిధవిషయ నివిష్టమతియగు కవిగారి కరిజ్ఞానమున కీ "నవకుసుమాంజలి" యాదర్శము. ఇదిగాక, వేంకటరామయ్యగారు మాలతీమాధవము, ఉత్తరరామచరితము. రాజశేఖరుని విద్ధసాలభంజిక రసోత్తరముగా ననువదించిరి. విద్ధసాలభంజిక 1906 లో రచితమై చిలకమర్తి లక్ష్మీనరసింహము వెలువరించిన 'మనోరమ' పత్రికయందు బ్రకటింప బడినది. ఉత్తరరామచరిత్రాంధ్రీకృతి యసంపూర్ణము. వీరి రచనలు చాలవఱకు బరివర్తనములైనను, శయ్యలో స్వాతంత్ర్యము నిండుగా నుండుటచే రక్తిగట్టి శాశ్వతత్వము సంపాదించుకొన జాలియున్నవి. తెనిగింపులో నింతగా నింపు పుట్టించురచన యెందఱకో యలవడదు. ఈపొందిక కనుగొనుడు:

సీ. మఱుగ గాగిన పాలమఱపించు కరముల

గిలిగింతనెవడు పొంగించుజలధి

భువనత్రితయ దివ్యభవనంబునకెవండు

నవసుధారస లేపనంపుగుంచె

సిద్ధౌషధంబయి చెలగి యెవ్వనివెల్గు

మదనపల్లి నివుళ్ళు పొదలజేయు

జివురు విల్తుని కేళి భవనాంగణమునకు

జారుచందన పంతచర్చ యెవడు

గీ. అతడు వెలుగొందు గుంకుమన్యాసగౌర

మానినీరమ్య వదనోపమానమూర్తి

ఘటితచక్రవాక మిధున పటుతరార్తి

సాంద్రతరకీర్తి యామినీచక్రవర్తి. ఉ. ఆడదు పూవుదోట గొనియాడదు వెన్నెలతేట బోటులం

గూడదు కేళిమండపము గుమ్మమువంకను దొంగిచూడదున్,

వేడదు వేషపోషణము, వీడదు కెంజిగురాకుపాంపు బూ

బోడి తదీయ నవ్యమృదు మోహన వేష విభావనారతిన్.

ఇట్టి మహాకవి రాజమహేంద్రవరము మునిసిపలుహైస్కూలు సహాయోపాధ్యాయుడై శిష్యబృందమునకు సాహిత్యభిక్ష నందించెను. కవితా సరస్వతిని గుఱిచి యీ రచయితహృదయ మిట్లు నవకుసుమాంజలి పీఠికలో బయటబడినది.

"ఈ శూన్యప్రపంచమం దాదేవి కొక్క తెకే నేను కావలసినవాడను.నాకు గావలసినదియు ఆ దేవీయే ఏమనగా, కవితయే నా జీవిత సర్వస్వము, కవితయే నాకు స్వర్గద్వారము, కవితయే నాకు మోక్షసాధనము."

                          _________